
సమస్య గుర్తింపు ఇక ఈజీ
● విద్యుత్ లైన్లపై లైన్‌ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు ● సమస్య గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కొత్త విధానం ● అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు ● త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
కడెం: అటవీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. వానాకాలంలో ఈదురుగాలులు సంభవించినప్పుడు విద్యుత్‌లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు సమస్యను గుర్తించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తుంటారు. అంతవరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇక నుంచి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్ పడనుంది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్‌శాఖ అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్‌ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
12 చోట్ల ఏర్పాటు..
విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేలా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు విద్యుత్ సరఫరా అందించే విద్యుత్‌లైన్‌లపై అటవీ ప్రాంతాల్లో లైన్‌ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. కడెం, పెంబి మండలాల్లోని 33 కేవీ లైన్‌పై ఆరుచోట్ల, కడెం మండలంలోని అల్లంపల్లి, ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలోని రాజురా 11 కేవీ విద్యుత్‌లైన్‌లపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. లైన్‌ఫాల్ట్ కండక్టర్ల ద్వారా విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైవిద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది.
పని తీరు ఇలా..
విద్యుత్ సరఫరా నిలిచిపోగానే వైర్లకు ఉన్న మూడు కండక్టర్లు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి. లైన్‌ఫాల్ట్ కండక్టర్ల వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం ద్వారా లైన్‌మెన్, ఏఈఈ, డీఈఈ, ఎస్‌ఈ వరకు అంతరాయం సమాచారం అందజేస్తుంది. ఇందుకు సోలార్ సిస్టంలో సిమ్ వేసి ఉంచుతారు. అందులో సేవ్ చేసిన నంబర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు విద్యుత్ లైన్‌కు ఎంత దూరంలో సమస్య ఉందని సమాచారం తెలిపే సిస్టం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
త్వరలో పూర్తిస్థాయి సేవలు
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పలుచోట్ల విద్యుత్‌లైన్లకు లైన్‌ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి పూర్తిస్థాయి సేవలు అందుబుటులోకి వస్తాయి.
– ఎం.రాంసింగ్, ఏఈఈ

సమస్య గుర్తింపు ఇక ఈజీ

సమస్య గుర్తింపు ఇక ఈజీ