
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్‌బాల్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సరైన మార్గంలో జీవనం సాగించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచింగ్ క్యాంప్ రామకృష్ణాపూర్‌లోనే ఏర్పాటు చేస్తామన్నారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, గణపతి తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు లీగ్ పోటీలు..
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల కోసం స్టేడియంలో రెండు గ్రౌండ్‌లు సిద్ధం చేశారు. మొదటిరోజు గ్రౌండ్ నంబర్ 1లో నిజామాబాద్ –సిద్దిపేట జట్లు తలపడగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు పోటీ పడగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ మధ్య జరిగిన లీగ్‌లో ఆదిలాబాద్ గెలుపొందాయి. రెండో గ్రౌండ్‌లో మెదక్ –గద్వాల్ జట్లు తలపడగా గద్వాల్, కరీంనగర్ –నల్గొండ జట్ల మధ్య జరిగిన లీగ్‌లో నల్గొండ జట్లు గెలుపొందాయి.