
సమస్య పరిష్కరించాలని రైతు ఆత్మహత్యాయత్నం
లక్ష్మణచాంద: తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన రైతు పసుపుల గంగాధర్‌కు 10 గుంటల భూమి ఉంది. దానికి పట్టాపాస్ బుక్ ఉండడంతో పాటు ఏటా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నాడు. అయితే ఆ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనదిగా చెబుతూ సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని తనకు చూపాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. మనస్తాపం చెందిన గంగాధర్ బుధవారం మధ్యాహ్న సమయంలో తహసీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన రైతులు, అధికారులు అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం తహసీల్దార్ సరిత రైతుతో మాట్లాడారు. దీనిపై సాక్షి తహసీల్దార్ సరితను వివరణ కోరగా రైతు ఫిర్యాదుతో గతంలోనే సర్వేయర్ వెళ్లి పంచనామా నిర్వహించారన్నారు. దానికి రైతు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో డీఐకి, ఏడీ నిర్మల్‌కు చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు ఫిర్యాదు పంపుతున్నట్లు తెలిపారు.