నేడే సార్వత్రిక సమ్మె | - | Sakshi
Sakshi News home page

నేడే సార్వత్రిక సమ్మె

Jul 9 2025 6:59 AM | Updated on Jul 9 2025 7:48 AM

నేడే సార్వత్రిక సమ్మె

నేడే సార్వత్రిక సమ్మె

● సింగరేణిలో ఏకమైన కార్మిక సంఘాలు ● విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు ● లేబర్‌ కోడ్‌లతోపాటు సింగరేణి పరిధిలో డిమాండ్లు

శ్రీరాంపూర్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేసేందుకు కార్మికసంఘాలన్నీ ఏకమయ్యాయి. కొద్ది రోజులుగా సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గనులపై విస్తృత ప్రచారం నిర్వహించాయి. బీఎంఎస్‌ మినహా అన్ని సంఘాలు సమ్మెకు ‘సై’ అనడంతో సింగరేణిలో సమ్మె అనివార్యమైంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు సీఐటీయూ, టీబీజీకేఎస్‌ కలిసి సింగరేణి కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడ్డాయి. హెచ్‌ఎంఎస్‌, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎ న్టీయూసీ సంఘాలు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పేరుతో మరో జేఏసీగా ఏర్పడి సమ్మెలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇదిలా ఉంటే మే 20వ తేదీనే ఈ సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలు ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావర ణం నేపథ్యంలో జూలై 9వ తేదీకి వాయిదా వేశారు.

సింగరేణిలో డిమాండ్లు

దేశ వ్యాప్తంగా బ్యాంకులు, బొగ్గు సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు అసంఘటిత రంగాల్లో కూడా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె డిమాండ్‌ ఉంది. కానీ సింగరేణిలో ఈ లేబర్‌కోడ్‌లతో పాటు ఇతర డిమాండ్లను కూడా చేర్చి జేఏసీ నేతలు కొద్దిరోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారు.

● కార్మికులకు పెర్క్స్‌పై ఆదాయపు పన్ను కంపెనీ చెల్లించాలి.

● కార్మికులకు సొంతింటి పథకం అమలు చేసి ఇంటి స్థలంతో పాటు రూ.25 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి.

● తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి కేటాయించాలి

● కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలి.

సమ్మెకు బీఎంఎస్‌ దూరం

ఈ సమ్మెకు జాతీయ సంఘమైన బీఎంఎస్‌ దూరంగా ఉంది. మే 20న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదని, అందుకే సమ్మెకు దూరంగా ఉంటున్నామని తెలిపింది. సమ్మె వాయిదా పడటంతో నేడు ఈ సమ్మె రాజకీయ ప్రేరేపిత సమ్మె అని, తాము సమ్మెకు దూరంగా ఉంటున్నామని, కార్మికులు పాల్గొనవద్దని ఆ సంఘం నాయకులు ప్రకటన చేశారు.

వద్దంటున్న యజమాన్యం..

ఈ సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని సింగరేణి యాజమాన్యం కోరింది. ఈ మేరకు అన్ని ఏరియాల జీఎంలు, కార్మికులు రోజువారిలాగానే నేడు విధులకు హాజరుకావాలని కోరింది. సమ్మె డిమాండ్లు తమ పరిధిలో లేవని, జాతీయ స్థాయి సమస్యలపై సింగరేణిలో సమ్మె చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement