
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్వేత, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కాజిపల్లికి చెందిన జాగేటి రాంచెందర్ (51) కూలీ పనులు చేస్తూనే గతేడాది కొంతమేర భూమి కౌలుకు తీసుకుని అప్పుచేసి పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి గడ్డిమందు తాగి భార్య భారతితో చెప్పాడు. వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
దొంగలను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి
చెన్నూర్: మండలంలోని సుబ్బారాంపల్లిలో వృద్ధురాలి మెడలోని గొలుసు దొంగిలించిన వారిని గుర్తి స్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ దేవేందర్‌రావు తెలిపారు. మంగళవారం సీసీ ఫుటేజీ చిత్రాలను విడుదల చేశారు. గుర్తిస్తే 8712656553 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
ప్రియుని ఇంటి ఎదుట బైఠాయింపు
చెన్నూర్: చెన్నూర్‌కు చెందిన బట్టల వ్యాపారి కుడికాల మధు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన బొడమిది సౌమ్య మంగళవారం ప్రియుని ఇంటి ఎదుట బైఠాయించింది. పదేళ్ల క్రితం తనను ప్రేమించి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. మూడేళ్ల క్రితం మళ్లీ తన వెంటపడి పెళ్లి చేసుకున్నాడని, అబార్షన్‌కూడా చేయించాడని పేర్కొంది. ఇంటికి తీసుకెళ్తానని చెప్పి కాలయాపన చేస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు.
పోచంపల్లిలో మరో యువతి..
తాండూర్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు న్యాయపోరాటానికి దిగిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తాండూర్ మండలం పోచంపల్లికి చెందిన బోరేం శ్వేత, సమీప బంధువైన గొర్లపల్లి కళ్యాణ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించాడు. పెళ్లి చేసుకోవాల్సిందేనని గట్టిగా పట్టుబట్టడంతో చేసుకోనని చెప్పేశాడు. దీంతో సదరు యువతి మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. మాదారం ఎస్సై సౌజన్య యువకుడిని పిలిపించి మాట్లాడతానని నచ్చజెప్పడంతో తాత్కాలికంగా తన న్యాయ పోరాటాన్ని విరమించింది. కాగా ఈ ఘటన మండలంలో చర్చనీయాంశమైంది.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య