
ఖజానా చెరువును ఈదేశాడు..
● నిర్మల్ వైద్యుడి ఘనత ● భారతదేశ చిత్రపటం ఆకృతిలో స్విమ్మింగ్ ● ఐరన్‌మ్యాన్ చాలెంజ్–2025కు సన్నద్ధం
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గొలుసుకట్టు చెరువుల్లోని ఖజానా చెరువులో సుమారు 40 నిమిషాల్లో కిలోమీటర్ దూరం మేర ఈత ద్వారా ఆరోగ్య ప్రాధాన్యత, ప్రత్యేకతను చాటారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటిల్లో ఆయన ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ప్రతీరోజు ఈత అభిరుచిగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అలనాటి నిమ్మనాయుడు కాలం నుంచి గొలుసు కట్టు చెరువుల్లో చారిత్రక ఖజానా చెరువుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వెంకటాద్రిపేట్ సమీపంలోని ఈ చెరువులో మంగళవారం ఈత కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన సరిగ్గా 41 నిమిషాల్లో 919 మీటర్ల మేర దూరాన్ని అవలీలగా ఈదారు. జియోట్యాగింగ్ ద్వారా ఆయన స్విమ్మింగ్ చేసిన మార్గం అచ్చు భారతదేశ చిత్రపటం ఆకృతిని పోలి ఉండడం గమనార్హం. గోవాలో వచ్చే నవంబర్ 9న అరేబియా సముద్రంలో నిర్వహించే ఐరన్ మ్యాన్ స్విమ్మింగ్ చాలెంజ్–2025లో విజయమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో నెదర్లాండ్స్ దేశంలోని ఆమ్‌స్టర్‌డమ్‌లో నిర్వహించిన మారథాన్ రన్‌లోనూ 34.8 కిలోమీటర్ల దూరం పరుగెత్తి పురస్కారం అందుకున్నారు. సైక్లింగ్‌లోనూ అభిరుచి కలిగిన ఆయన నిర్మల్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు పాలజ్ గణేశ్ ఆలయానికి దాదాపు 75కిలోమీటర్ల దూరం, నిర్మల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ సూర్య దేవాలయం వరకు దాదాపు 200 కిలోమీటర్ల పైగా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒక వైద్యుడిగా రోగులకు సేవలందించే ప్రయత్నంలో ఆరోగ్యంపై పలు విధాలుగా చైతన్యవంతం చేస్తాం. ఇందులో భాగంగానే ఫిట్నెస్ అవగాహన కోసం స్వీయంగా ఆచరిస్తూ ఇతరులకు చెప్తే బాగుంటుందని ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను...’ అని లక్ష్మీనర్సింహరెడ్డి తెలిపారు.