
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్
● నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ను విక్రయించిన సర్కారు ఉద్యోగులు ● వన్‌టౌన్‌లో కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి
అదిలాబాద్‌టౌన్: గతంలో నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘట న సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపిన వివరా ల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన ఠాకూర్ రూపారాణి భర్త ఠాకూర్ రవీందర్ సింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో అతనికి కొండూరి గంగాధర్ అనే నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగి పరిచయమయ్యాడు. గంగాధర్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 346, ప్లాట్ నంబర్ 179, అటెండర్స్ కాలనీలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దేవల్ల గోవర్ధన్ పేరు మీద ఒక ప్లాటు అమ్మకానికి ఉందని రవీందర్ సింగ్‌కు తెలిపాడు. నిజానికి ఈ ప్లాటు 1996లో ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా అమీరుద్దీన్ అనే వ్యక్తికి కేటాయించినట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. అయితే 2006 లో రూపారాణి, ఆమె భర్త ఆ ప్లాటుకు కె.గంగాధర్, డి.గోవర్ధన్ సమక్షంలో రూ.65 వేలు చెల్లించారు. 2006 నవంబర్ 10న కె.గంగాధర్ మధ్యవర్తిత్వం వహించి దేవల్ల గోవర్ధన్‌తో అమ్మకపు ఒప్పందం చేయించాడు. తరువాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4433/06 ప్రకారం రూపారాణి పేరు మీద ప్లాటు రిజిస్టర్ అయింది. రుపారాణి భర్త ఠాకూర్ రవీందర్‌సింగ్ బదిలీ కావడంతో వారు నిర్మల్‌కు మారారు. ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడల్లా తమ ప్లాటును చూసుకునేవారు. అయితే ఇటీవల ఆ ప్లాటు వాస్తవానికి అమీర్‌ఖాన్ కుమారుడు అహ్మద్‌ఖాన్‌కు చెందినదని గుర్తించారు. నకిలీ పట్టా పత్రాలను అసలు పత్రాలుగా చూపించి తమను మోసం చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు పూర్తయి న తర్వాత వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదివరకే ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొండూరి గంగాధర్‌పై కేసు నమోదైందని, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ కేసులో ప్రస్తు తం కె.గంగాధర్, డి.గోవర్ధన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.