
పాల ధరల్లో వ్యత్యాసం!
● వసతిగృహాలకు సరఫరాలో తేడాలు ● ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా పెంపు ● పంపిణీదారుల తీరుతో సర్కారుపై భారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యా వసతిగృహాల్లో సరఫరా చేస్తున్న పాల ధరల వ్యత్యాసంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బీసీ, సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనార్టీ, గిరిజన, సంక్షేమ తదితర హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచి పంపిణీదారులు పాలు(టోన్డ్) సరఫరా చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో డీపీసీ(జిల్లా కొనుగోలు కమిటీ) ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలోనే ధర నిర్ణయిస్తుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా పాల లీటరు ధర నిర్ణయిస్తున్నారు. డెయిరీ నిర్ధేశించిన ధర, రవాణా చార్జీలు కలిపి హాస్టళ్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దూరభారం, బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారనే కారణం చూపుతూ చాలామంది పంపిణీదారులు స్థానికంగా లభ్యమయ్యే ధర కంటే అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో పది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ఎమ్మార్పీ రూ.60కంటే అధికంగా రూ.2పెంచి రూ.62తో ఇవ్వడంపై కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి వెళ్లగా ఆయన తిరిగి ఎమ్మార్పీకే సరఫరా చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు.
మారుతున్నాయి..
పాల ధర లీటరుకు ఒకే తీరుగా ఉన్నప్పటికీ వసతిగృహాలకు సరఫరా చేసే సమయానికి ధరలు మారుతున్నాయి. పంపిణీదారుడికి డెయిరీ నుంచి ఒక్కో లీటరుపై రూ.7వరకు కమీషన్ చెల్లిస్తోంది. రవాణా చార్జీలు కలిపి ఎమ్మార్పీకి విక్రయించాలి. దూరభారం, నెలల తరబడి బిల్లుల చెల్లింపులపై జాప్యం జరుగుతోందని అంతకంటే అధికంగా చెల్లిస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు(బీఎంసీయూ) సమీపంలో ఉన్న జిల్లాల్లోనూ అధిక ధరలకే విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మెదక్, గద్వాల జిల్లాల్లో సరఫరా పాల ధర ఒక లీటరకు రూ.63గా ఉంది. పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలకు రూ.62గా ఉంది. కొత్తగూడెం జిల్లాలో రూ.65వరకు ఉంది. దీంతో బీఎంసీయూ ఉన్న జిల్లాల పంపిణీదారులు సైతం స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటూ వాస్తవ ధర చెల్లించేలా ఉత్తర్వులు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బీఎంసీయూ నుంచి విజయ డెయిరీ వాహనాల్లోనే జిల్లా కేంద్రాల దాక పాలు వెళ్తున్నప్పటికీ అధికంగా చెల్లింపు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రతీ నెలా రూ.లక్షల్లో అదనపు భారం పడుతోంది. మరోవైపు కొన్ని చోట్ల వసతిగృహాల నిర్వాహకులు తక్కువ మొత్తంలో పాలు తీసుకుంటూ ఎక్కువ బిల్లులు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.