
అరక కూలీకి డిమాండ్
● యంత్ర సాగు ఎంతైనా తప్పడం లేదు ● కనుమరుగవుతున్న కాడెడ్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో యంత్రాల వినియోగం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఒక దశలో కాడెడ్లతో అవసరం ఏర్పడుతోంది. కాడెడ్లు కనుమరుగు అవుతుండడంతో ఎడ్లు ఉన్న రైతులకు అరక డిమాండ్ పెరిగింది. పత్తి విత్తనాలు వేయాలంటే సాళ్లు పట్టడానికి, కలుపు నివారణకు దౌర కొట్టడానికి, నారుమడి దున్నడానికి అరక కట్టాల్సిందే. జిల్లాలో పత్తి విత్తుకోవడం 85శాతం పూర్తయింది. మొదట విత్తిన పత్తిలో కలుపు నివారణకు దౌరలు కొడుతుండగా.. మరికొందరు సాళ్లు వేసుకుని విత్తనాలు వేస్తున్నారు. మరోవైపు నారుమడులు సిద్ధం చేసుకుని మొలక అలుకుతున్నారు. ఆయా పనుల్లో అరక కూలి రోజుకు రూ.2వేల నుంచి రూ.2,200 తీసుకుంటున్నారు. పత్తి చేన్లలో దౌర కొట్టాలంటే ట్రాక్టర్ల ద్వారా వీలు కాదు. మొక్కలు విరిగిపోవడం, టైర్ల కింద పడడం జరుగుతుంది. వర్షాకాలంలో చేన్లు బురదగా మారుతాయి. ఈ సమయంలో కాడెడ్ల ద్వారా దౌర కొట్టడం సులభమని రైతులు ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు.