
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
నస్పూర్: పోలీస్‌స్టేషన్‌లోని పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల స్థితిగతులపై వివరాలు సేకరించారు. బాలికల అదృశ్యం కేసుల్లో వేగం పెంచాలని, నిందితులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించాలని తెలిపారు. దొంగతనాలు జరుగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై ఉపేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.