
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
తాండూర్: మండలంలోని బోయపల్లి బోర్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందాడు. ఎస్సై డి.కిరణ్‌కుమా ర్ కథనం ప్రకారం..ఓదెలు గ్రామానికి చెందిన అయిలి మల్లేశ్‌గౌడ్ (36) గీత కార్మిక వృత్తిరీత్యా కాసిపేటలో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మల్లేశ్‌గౌడ్ శనివారం రాత్రి బోయపల్లి బోర్డు సమీపంలోని దాబాలో బిర్యానీ తీసుకున్నాడు. తిరిగి బైక్‌పై బోయపల్లి బోర్డు వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రాధిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ప్రమాదవశాత్తు నీటమునిగి మహిళ..
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కాలేజ్‌రోడ్‌లో గల గోదావరి నదిలో ఆదివారం స్నానం ఆచరించేందకు వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. సోమగూడెంకు చెందిన మద్దెల లక్ష్మి (54) తొలి ఏకాదశి సందర్భంగా గోదావరిలో స్నానం ఆచరించేందుకు వచ్చింది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఆధార్‌కార్డు పరిశీలించగా కోటపల్లి మండలం నాగంపేట్ అడ్రస్‌తో ఉంది. లక్ష్మి భర్త రాజలింగు సింగరేణి ఉద్యోగి అని తెలిసింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్మికుడికి గాయాలు..
జిల్లా కేంద్రంలో ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో కార్మికుడికి తీవ్రగాయలైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పశ్చిమబెంగాల్‌కు చెందిన భానుదేవ్ ఆదివారం పనులు నిర్వహిస్తుండగా లిప్టు సహాయంతో రోప్‌ద్వారా బకెట్‌లో ఇటుకను 3వ అంతస్తుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ రోప్ తెగింది. ఇటుక బకెట్ కిందపడడంతో భానుదేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం అస్పత్రికి పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరు ఆత్మహ త్య
భైంసాటౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెంది ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాండ్రిగల్లికి చెందిన సయ్యద్ ముజీం(42) మేస్త్రి పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురి కావడంతో, కుటుంబానికి భారం కావద్దనే ఉద్దేశంతో ఆదివారం కుంచావలి గుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
నిర్మల్‌టౌన్: పట్టణానికి చెందిన ఇద్దరిపై ఇటీవల దాడికి పాల్పడి కిడ్నాప్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాలో కీలక నిందితుడైన ఇబ్రహీం బిల్డర్ అలియాస్ అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తాహెర్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. అదేవిధంగా మహారాష్ట్రలోని ధర్మబాద్‌కు చెందిన షేక్ రౌప్, భైంసాకు చెందిన రహిజ్‌లు కూడా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. వీరికి తాహెర్‌తో పరిచయం ఉంది. ఈక్రమంలో తాహెర్‌ను రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తాహెర్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. భైంసాకు చెందిన ఇటుకల వ్యాపారి ఇబ్రహీం బిల్డర్‌కు రూ.1.50 లక్షల సుఫారీ ఇచ్చారు. సల్మాన్, మహమ్మద్ సోహెల్ మరోఇద్దరితో కలిసి ఇబ్రహీంలు పట్టణంలోని బైల్ బజార్ వద్ద తాహెర్ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న డ్రైవర్లపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ విషయమై డ్రైవర్ నుమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక సోఫినగర్ ప్రాంతంలో ఇబ్రహీం ఉన్నాడని పక్కా సమాచారంతో ఈనెల 5న పట్టణ సీఐ దాడి చేశారు. స్థానిక దర్గా వద్ద అతన్ని అరెస్టు చేసి కత్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.