
‘సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి’
గుడిహత్నూర్: పీహెచ్‌సీలో ఎలాంటి సమస్యలున్నా త మదృష్టికి తీసుకు రావాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఇటీవల స్థానిక పీహెచ్‌సీలో పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డ ఘటన నేపథ్యంలో బుధవారం పీహెచ్‌సీని సందర్శించారు. వైద్యాధికారి శ్యాంసుందర్ ను అడిగి ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో లక్షల విలువైన వైద్యోపకరణాలు చిన్నచిన్న సమస్యలతో మూలనపడి ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని, తాగినీటి సమస్య ఉందని చెప్పడంతో పీవో సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాలటౌన్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద జిల్లాలో డి–అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అర్హత, అనుభవం కలి గిన స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–అనుదన్ (http://grants-msje.gov.in/ngo-login) పోర్టల్‌లో ఈ నెల 30లోగా వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తును జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
తాటిచెట్టు పైనుంచి పడి గాయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తాటిచెట్టు పైనుంచి కిందపడి గీతకార్మికుడికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీలోని గొల్లపల్లికి చెందిన కోట బుచ్చాగౌడ్ బుధవారం తాటిచెట్టు ఎక్కి కిందకు దిగుతుండగా అదుపుతప్పి కిందపడి పోయాడు. తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.