మాటల్లో పెట్టి.. మట్టి చేతిలో పెట్టారు..!
● రెండు తులాల బంగారం అపహరించిన కేటుగాళ్లు
భైంసాటౌన్: పట్టణంలోని బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ దంపతులను అధికారులమని నమ్మించి వారి వద్ద ఉన్న బంగారంతో ఉడాయించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు కుంటాల మండలం అంబకంటికి చెందిన రాజవ్వ, గోవింద్ భైంసాలోని పిప్రికాలనీలో ఉన్న బంధువుల ఇంటికి బస్సులో బయలుదేరారు. పిప్రికాలనీ బస్టాప్ వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వారిని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు తాము అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయని, ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసి జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. దుండగుల్లో ఒకరు తన ఒంటిపై ఉన్న చైన్, ఉంగరాలు తీసి మిగతా ఇద్దరికి ఇవ్వగా వారు పేపర్ పొట్లం ప్యాక్ చేసి ఇచ్చినట్లు నటించారు. వారిని నమ్మిన రాజవ్వ సైతం తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు గొలుసు తీసి సంచిలో పెట్టుకుంటుండగా, వారిలో ఒకడు తాను పేపర్‌లో పొట్లం కట్టిస్తానని తీసుకున్నాడు. వారిని మాటల్లో పెట్టి వారి వద్ద ఇదివరకే ఉన్న మరో పొట్లం రాజవ్వకు ఇచ్చారు. కొద్దిసేపటికి వారు బైక్‌పై వెళ్లిపోయారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత రాజవ్వ పొట్లం విప్పి చూడగా అందులో మట్టి, చిన్నపాటి కంకర కనిపించడంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు.
మహిళను బురిడీ కొట్టించి గొలుసు అపహరణ
నిర్మల్‌టౌన్: మహిళను బురిడీ కొట్టించి రెండు తులాల గొలుసు అపహరించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు శాస్త్రినగర్ కాలనీకి చెందిన లక్ష్మి అదే కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. పోలీసులమని పరిచయం చేసుకున్నారు. చోరీలు అధికంగా జరుగుతున్నాయని, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి సంచిలో పెట్టుకోవాలని సూచించారు. ఆమె చైన్ తీసిఇవ్వగా పేపర్లో కట్టి ఇస్తామని చెప్పి వారు ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మట్టిపెట్టిన కవర్లు ఆమెకు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన మహిళ పొట్లం తీసి చూడగా చైన్‌కు బదులు చిన్నచిన్న రాళ్లు కనిపించాయి. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


