ఆ బస్సుకు ఏటా పూజలు
కడెం: ఏదైనా ఓ గ్రామానికి నూతనంగా బస్సును ప్రారంభిస్తే ఆ బస్సుకు పూజలు నిర్వహించి.. స్వాగతం పలకడం సాధారణం. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ బస్సుకు ఏటా పూజలు నిర్వహిస్తుంటారు అక్కడి ప్రజలు. మండల కేంద్రం నుంచి మారుమూల గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ఒక్కటే దారి. నవబ్‌పేట్ సమీప ఆటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటి 14 కిలోమీటర్లు వెళ్లాలి. లేదంటే కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో తెప్పపై వెళ్లాలి. ఎత్తెన గుట్టలు, రాళ్లు, రప్పలతో రోడ్డు సరిగా లేకున్నా ఆర్టీసీ ఏళ్లుగా బస్సు నడుపుతోంది. రోజుకు రెండు ట్రిప్పులు వస్తుంది. వర్షాకాలం మాత్రం బస్సును నిలిపివేస్తారు. చలికాలంలో ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభించిన ప్రతీసారి బస్సు అలంకరించి, పూజలు చేసి స్వాగతం పలుకుతారు. గంగాపూర్, కొర్రతండా, రాణిగూడ పంచాయతీల ప్రజలు గ్రామాలు దాటి బయట ప్రపంచానికి రావాలంటే సరైన రవాణా వ్యవస్థ లేదు. దీంతో ఆర్టీసీ బస్సుతో వీరికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.


