జంతుగణనకు సన్నద్ధం
జన్నారం: ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే శాఖాహార, మాంసహార జంతువుల గణనకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో బీట్‌ల వారీగా ట్రాన్స్‌క్ట్ లైన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. జన్నారం అటవీ డివిజన్‌లోని 40బీట్‌లలో శాఖాహార జంతువుల కోసం ఏర్పాటు చేసుకొని ట్రాన్సెక్ట్ లైన్(నమూన రేఖ) ను బీట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. ట్రాన్సెక్ట్ లైన్‌లను ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ గురువారం పరిశీలించారు. శాఖాహార, మాంసహార జంతు గణన కోసం ముందుగా రేఖలు ఏర్పాటు చేసుకొని, వాటిలోనే గణన చేపడుతారని తెలిపారు. జనవరి మాసంలో జంతుగణన ప్రారంభించే అవకాశాలున్నందునా ముందస్తుగా ఈ పనులు చేపడుతూ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జన్నారం డివిజన్‌లో మూడు అటవీ రేంజ్‌లు, 21అటవీ సెక్షన్, 40 బీట్‌లు ఉండగా, అందరు సిబ్బంది గణనలో పాల్గొంటారని, వీరికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు ఎఫ్‌డీవో తెలిపారు. వలంటీర్ల సహాయం కూడా అవసరం ఉన్నందునా ఆసక్తి గలవారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.


