ముచ్చటగా మూడోసారి
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని మాలన్‌గొందిలో ముచ్చటగా మూడోసారి ఆ కుటుంబాన్ని సర్పంచ్ గిరి వరించింది. 2014లో తిరుపతి సర్పంచ్‌గా ఎన్నిక కాగా, 2019లో మడావి భార్య సీత విజయం సాధించారు. ఈసారి మళ్లీ 300 మెజర్టీతో మడావి సీత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సీసీరోడ్డు, డ్రెయినేజీల నిర్మాణంతోపాటు భీమన్న ఆలయం అభివృద్ధి చేస్తున్న కృషిని గుర్తించి తమను ఎన్నుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే చిర్రకుంట పంచాయతీ సర్పంచ్‌గా 2019లో పార్వతిబాయి ఎన్నిక కాగా, ఈసారి కూడా బీజేపీ మద్దతుతో ఆమె గెలుపొందారు. వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
వరించిన అదృష్టం
ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్ పంచాయతీలో టాస్ ద్వారా విజేతలను నిర్ణయించారు. పంచాయతీలో మొత్తం 445 ఓటర్లు ఉండగా 382 పోలయ్యాయి. నోటాకు మూడు ఓట్లు పడగా, చెల్లనివి 22 ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు నీలాకుమారి, కమలాబాయికి సమానంగా 154 చొప్పున ఓట్లు వచ్చాయి. మూడుసార్లు రీకౌటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో చివరికి టాస్ వేయగా నీలాకుమారిని అదృష్టం వరించింది.


