
ముగిసిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు
● జిల్లాకు 15 మెడల్స్ ● జాతీయస్థాయికి ఇద్దరు ఎంపిక
మంచిర్యాలటౌన్: పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టైసన్ బాక్సింగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. 260 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఆద్యంతం ఆకట్టుకునేలా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. జిల్లా కేంద్రంలో కోచ్ రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ కేంద్రం నుంచి 19 మంది పోటీల్లో పాల్గొనగా 9 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 15 మెడల్స్‌ను సాధించారు. గోల్డ్ మెడల్‌ను సాధించిన వారిలో ఏ.రక్షిత్, జి.రిశ్వంత్, ఎండీ ఉబేద్, క్రితి అగర్వాల్, బి.రుత్విక్ కుమార్, ఓ.సంస్కృతి, సీహెచ్.హాసిని, బి.అనుదీప్, ఎస్.షణ్ముఖ్ తేజ ఉన్నారు. సిల్వర్ మెడల్ సాధించిన వారిలో పి.కార్తీక్, జి.శ్రీనాథ్, బ్రాంజ్ మెడల్ సాధించిన వారిలో ఎం. అశ్వత్, పురబ్ బిశ్వాస్, బి.అనురాగ్, సీహెచ్.జగదీశ్వర్ ఉన్నారు. వీరిని జిల్లా యువజనుల క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అభినందించారు. జాతీయ స్థాయిలో వచ్చేనెల 3న గోవాలో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు క్రితి అగర్వాల్, ఉబేద్ ఎంపికై నట్లు కోచ్ రాజేశ్ తెలిపారు.