
ఇందిరమ్మ ఇళ్లకు ధరాఘాతం
● పెరిగిన స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు ● పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో 2,150 ఇళ్ల మంజూరు ● పనులు ప్రారంభించినవి 897 మాత్రమే.. ● బేస్‌మెంటు స్థాయి వరకు పూర్తయినవి 134
మంచిర్యాలటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రోజు రోజుకు పెరుగుతున్న ధరలు కళ్లెం వేస్తున్నాయి. స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదటి విడతలో అవకాశం కల్పించింది. జిల్లాలోని 16మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంటిస్థలం ఉండి, ఇల్లు లేని 2,150మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 897మంది మాత్రమే ఇళ్లకు ముగ్గు పోసి పనులు చేపట్టారు. 134 బేస్‌మెంటు స్థాయి వరకు పూర్తి చేయగా.. ప్రభుత్వం రూ.1లక్ష చొప్పున హౌసింగ్ శాఖ ద్వారా అందజేసింది. ఇంటి నిర్మాణాన్ని బేస్‌మెంటు వరకు నిర్మిస్తే రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు పూర్తి చేస్తే రూ.1.25లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75లక్షలు, రంగులు వేసిన తర్వాత రూ.లక్ష మొత్తంగా నాలుగు విడతల్లో రూ.5లక్షలు అందించనుంది. 897 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించినా మిగతా వారు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంటు, ఇసుక ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వేసవి కాలం ముగుస్తుండడంతో వర్షాకాలంలో నిర్మాణం ఇబ్బందిగా మారనుంది. ఇసుక దొరకని పరిస్థితి ఎదురవుతుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు చూడాల్సి ఉంది.
రెండో విడత జాబితాపై ఆశలు
మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో సగం కూడా ప్రారంభించలేదు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున వచ్చేలా అన్ని మండలాలు, మున్సిపాల్టీల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. రెండో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేయడంలో మండల, మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. రెండో విడతలోనైనా ఇళ్లు వస్తుందా లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలాల్లో లబ్ధిదారుల ఎంపికపై అధికారులు ఇంకా కసరత్తు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
జాబితా సిద్ధం చేస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్లు బేస్‌మెంటు స్థాయి వరకు నిర్మించుకున్న వారికి రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇల్లు మంజూరైన వారు నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేసుకుంటే డబ్బులు ఖాతాల్లో వేస్తాం. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకునేలా చూస్తున్నాం. రెండో విడత జాబితా మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేస్తున్నారు. అర్హతను బట్టి ఇళ్లు మంజూరు చేస్తాం.
– బన్సీలాల్, హౌసింగ్ పీడీ, మంచిర్యాల