
పోలీసుల పని తీరు భేష్
● మూడో స్థానంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ● సిటిజన్ ఫిడ్ బ్యాక్ ఆధారంగా ఎంపిక ● డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం: పోలీసుల పనితీరు, బాధితులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ సేకరణకు పోలీస్ శాఖ గత ఏడాది శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10 యూనిట్లను ఎంపిక చేసింది. ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు మూడో స్థానం దక్కింది. డీజీపీ జితేందర్ చేతులమీదుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఉత్తమ అవార్డును మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అందుకున్నారు. క్యూఆర్ కోడ్‌లను కమిషనరేట్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్లు, గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించారు. ప్రజలు అభిప్రాయాలను తెలియజేశారు. అవార్డు రావడంపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను అభినందించారు.