
టీచర్ల నైపుణ్యాల పెంపునకు శిక్షణ
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅర్బన్: టీచర్లు వృత్తి పరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులే సమాజ మార్పుకు దిక్సూచిలని, దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మితమవుతుందని అన్నారు. పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు, పాఠశాలలపై మరింత పర్యవేక్షణ పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోర్సు సెంటర్ క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్స్‌పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
గ్రామ పరిపాలన పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 25న గ్రామ పరిపాలన పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావులతో కలిసి జిల్లా విద్య, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచార శాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శివాజితో గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు, సిబ్బందిని నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, అగ్నిమాపక శాఖ అధికారి రమేష్‌బాబు, విద్యుత్ శాఖ అధికారి రమ్యశ్రీ, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

టీచర్ల నైపుణ్యాల పెంపునకు శిక్షణ