
వన మహోత్సవానికి సన్నద్ధం
● జిల్లాలో 36.50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ● ఎండల నుంచి రక్షణకు గ్రీన్ షేడ్ నెట్‌ల ఏర్పాటు ● ప్రతీ నర్సరీకి వన సేవకులు
పాతమంచిర్యాల: జిల్లాలో వన మహోత్సవం నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 306 నర్సీరల్లో మొక్కల పెంపకం ప్రక్రియ గత ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభించా రు. ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్‌లలో విత్తనాలు నాటి మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో ఈ ఏడాది పండ్ల జాతులు, పూలమొక్కలు, నీడనిచ్చే తదితర జాతులకు చెందిన 36.50లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నా రు. గత సంవత్సరం నాటిన మొక్కలు ఎదగకుండా చనిపోతే వాటి స్థానంలో మళ్లీ నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బంజరుభూములు, కాలువలు, చెరువుగట్లు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీలు, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణకు వన సేవక్‌లను నియమించారు. మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ పంచాయతీలోని నర్సరీలో పది వేల మొక్కలు పెంచుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి కలుపు తీసి ఎరువులు వేస్తున్నారు. చనిపోయిన, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా విత్తనాలు, మొక్కలు నాటుతున్నారు. ఎండ వేడికి మొక్కలు చనిపోకుండా ప్రతీ నర్సరీలో గ్రీన్‌షేడ్‌నెట్(నీడ పరదాలు) ఏర్పాటు చేశారు. జూన్‌లో ప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవంలో మొక్కలు నాటనున్నారు.
భారీ వృక్షజాతుల మొక్కలు
భారీ వృక్ష జాతుల మొక్కల పెంపకం ఈ ఏడాది నుంచి చేపట్టినట్లు జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ పి.శ్రీనివాస్ తెలిపారు. 11లక్షల మొక్కలను దా దాపు 2.5మీటర్ల ఎత్తు పెంచడానికి నర్సరీల్లో చర్యలు తీసుకుంటున్నారు. భారీ వృక్షజాతులుగా పిలిచే గుల్‌మొహార్, నిద్రగన్నేరు, కానుగ, సుభాబుల్, చైనా బాదం, తబోబియా, నల్లమద్ది, గీత కార్మికుల కోసం ఈత, తాటి మొక్కలు పెంచుతున్నారు. ఏడాదిపాటు నర్సరీల్లో పెరిగితే దాదాపు రెండు మీటర్ల నుంచి 2.5మీటర్లు ఉంటాయి. ఆ మొక్కలను ప్రభుత్వ స్థలాలు, చెరువుగట్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటితే నీడతోపాటు ఆహ్లాదంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీ మొక్కల నాటేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ ఇంట్లో మొక్కలు నాటుకోవాలి
వన మహోత్సవంలో భాగంగా పంపిణీ చేసే పండ్ల మొక్కలు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు ప్ర తీ ఇంట్లో నాటుకోవాలి. ఈ సంవత్సరం జూన్, జూలై మాసాల్లోనే వన మహోత్సవం పూర్తి చేయాలనుకుంటున్నాం. గ్రామాలు, పట్టణాల్లో పచ్చద నం పెరిగేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. – ఎస్.కిషన్, డీఆర్డ్‌డీవో
పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
నర్సరీల్లో మొక్కలు ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. రోజుకు రెండుసార్లు మొక్కలకు నీరు అందిస్తున్నాం. ఎండ నుంచి రక్షణ కోసం గ్రీన్ పరదాలను ఏర్పాటు చేశాం. మొక్కలు చనిపోకుండా ఎరువులు వేసి కాపాడుతున్నాం.
– పీ.శ్రీనివాస్, ప్లాంటేషన్ మేనేజర్