
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
నస్పూర్: ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పట్టణ పరిధిలో కేజీబీవీలో శనివారం ఆయన జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానంతోపాటు వినోదాన్ని పాఠ్య, పాఠ్యేతర అంశాలను నేర్చుకోవడానికి వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయ కర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈఓ దామోదర్‌రావు, స్పెషల్ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సౌకర్యార్థం లారీల సంఖ్య పెంపు
మంచిర్యాలఅగ్రికల్చర్: వరిధాన్యం తరలింపునకు అవసరమైన లారీల సంఖ్యను పెంచుతామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌లో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సెక్టార్–1, 2, 3, 4 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్‌మిల్లులకు ధాన్యం సరఫరాలో జాప్యం జరగకుండా లారీ సంఖ్య పెంచే విధంగా ట్రాన్స్‌ఫోర్ట్ యజమానులు సహకరించాలని తెలిపారు. జిల్లాలోని రైస్‌మిల్లులో దిగుమతి ఆలస్యం అవుతున్నట్లయితే కరీంనగర్‌కు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరుపేద, అణిచివేతకు గురైన, ఇతర బాధిత బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 17లోగా జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం బాలరక్షా భవన్, 9908541697, 9441506519 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.