
తప్పుడు పత్రాలతో కొలువులు!
● ఆదిలాబాద్ జిల్లా నివాస ధ్రువపత్రాలతో బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు ● ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల నుంచి దరఖాస్తులు ● నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఇతర రాష్ట్రాల యువకులు ● ఇచ్చోడలో ముగ్గురిపై కేసు ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఇచ్చోడ: ఇతర రాష్టాల నిరుద్యోగ యువకులు కొందరు ఆదిలాబాద్ జిల్లా నివాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు సాధించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నివాసముంటున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు పొందారని సమాచారం. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ద్వారా బయటకు రావడంతో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఆదివారం ఇచ్చోడలో కేసు నమోదైంది. ఎస్‌బీ అధికారుల ఫిర్యాదు మేరకు సహని సురాజ్, డాగ్ విజయ్, విశ్వుకర్మలపై కేసులు నమోదు చేశారు.
మీసేవ ద్వారా దరఖాస్తులు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో నివాసముంటున్నట్లు దరఖాస్తులు చేసుకున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ఆధార్, రేషన్ కార్డులు పాస్‌ఫొటోతో జిరాక్స్ పత్రాలు జతచేసి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి మీసేవ ద్వారా ధ్రువీకరణపత్రం జారీ చేస్తారు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తప్పుడు ఆధార్, రేషన్ కార్డులను సృష్టించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
భారీగా దరఖాస్తులు
ఇచ్చోడ మండలంలో భారీగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఒక్క ఇస్లాంనగర్ గ్రామం నుంచే 189 మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ గతంలో కొకస్‌మన్నూర్ పంచాయతీలో ఉండేది. ఇటీవల సాథ్‌నంబర్, ఇస్లాంనగర్ గ్రామాలు కలిసి నూతన పంచాయతీగా ఏర్పాటైంది. ఇస్లాంనగర్‌లో మొత్తం జనాభా మూడు వందల లోపు ఉంటుంది. ఇక్కడ ఉన్నత చదువులు చదువకున్న వారిని సైతం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం ఇస్లాంనగర్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా లేరు. అఽధికారులు ఆ దరఖాస్తులను రిజెక్ట్ చేశారే తప్ప, తప్పుడు ఆధార్, రేషన్‌కార్డులు ద్వారా నివాస ధ్రు వీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు గుర్తించకపోవడం వారి తప్పిదం కనిపిస్తుంది.
అభినవ్ యాదవ్ తండ్రి ప్రేమంత్‌హెచ్‌యాదవ్. ఇతడు ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో ఉంటున్నట్లు 2024 ఆగస్టు 14న నివాస ధ్రువపత్రం కోసం మీసేవ ద్వారా నంబర్(ఆర్‌సీ022411234864) దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి రిజెక్ట్ చేశారు. మరోసారి నిజామాబాద్ జిల్లా నుంచి మీ సేవ ద్వారా నంబర్ (ఆర్‌సీ 022511946191) ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి గతమార్చి 15న రిజెక్ట్ చేశారు.
సునీల్‌యాదవ్ తండ్రి రామనంద్ యాదవ్. అతనికి 2024 డిసెంబర్ 23న బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. కాల్ లెటర్‌లో ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ నివాసిగా అడ్రస్ ఉంది. కానీ ఇతను ఇక్కడ లేకపోవడం, గ్రామం నుంచి బీఎస్‌ఎఫ్, ఆర్మీలో ఉద్యోగం చేసేవారు లేరని గ్రామస్తులు తెలిపారు. సదరు వ్యక్తి ఇస్లాంనగర్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం పొంది ఉద్యోగంలో చేరడం గమనార్హం.
రిజెక్ట్ అయిన నంబర్ ద్వారానే మార్ఫింగ్
అధికారులు రిజెక్ట్ చేసిన దరఖాస్తు నంబర్‌తో నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇతరుల పత్రాన్ని రిజెక్ట్ అయిన దరఖాస్తు పత్రం నంబర్ ఆధారంగా మార్ఫింగ్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. గత కొన్నిరోజుల నుంచి మీసేవ కేంద్రాలు ఓటీపీ పద్ధతి ద్వారా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఓటీపీ ద్వారా మీసేవలో లాగిన్ కావచ్చు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా మీసేవల నుంచి దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తులను రిజెక్ట్ తర్వాత కొందరు మీసేవ నిర్వాహకులు నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశం ఉంది.
చర్యలు తీసుకుంటాం
తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగాలు సాధించినట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై విచారణ చేపట్టాలని స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశాం.
– వినోద్‌కుమార్, ఆర్డీవో