
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన తొండకూరి సాయన్న (45) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో నిర్మల్ నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్తున్నాడు. ఆటోను అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్ల కౌట్ల(బి) శాంతినగర్ మూలమలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయం కాగా 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.