
సరికొత్త మైత్రిబంధం పుస్తకంతోనే..
జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ టి.సంపత్ కుమార్ ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా పనిచేసి రిటైర్ అయ్యారు. సుధీర్ఘకాలంగా పుస్తకాలతోనే మైత్రిబంధం కొనసాగిస్తున్నారు. పలు నవలలు, కథల పుస్తకాలను తెలుగు, ఆంగ్లభాషల్లో రచించారు. నాలుగు దశాబ్దాలుగా పుస్తకాలనే నేస్తాలుగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. నేటి యువతరానికి చిన్నప్పటి నుంచే పుస్తక పఠనాన్ని అభిరుచిగా రూపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు.
నిర్మల్‌ఖిల్లా: పుస్తకమా.. పుస్తకమా.. నిన్ను చదవడంవల్ల ఉపయోగం ఏంటీ..! అంటే..‘తలదించుకుని నన్ను చదువు.. జీవితంలో నిన్ను తలెత్తుకుని జీవించేలా తయారుచేస్తా’ అంటుందట పాఠకుడితో.. విజేతల్ని మీ అభిరుచి ఏమిటని ప్రశ్నిస్తే ఎక్కువమంది ఠక్కున చెప్పే సమాధానం పుస్తక పఠనం... జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. ఎంత చదివితే అంత విజ్ఞానవంతుల్ని చేయగలిగే ఏకై క శక్తి పుస్తకానికే ఉంది. మారుతున్న కాలానికనుగుణంగా ప్రస్తుతం పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు క్రమంగా తగ్గుతోంది. ఆన్‌లైన్ అభ్యసనంతో పట్టుమని పది నిమిషాలు కూడా విద్యార్థులు పుస్తకాలు చదవలేకపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు నేర్పించే అతిముఖ్యమైన అలవాటు పుస్తక పఠనమే. మన పిల్లల్ని కూడా పుస్తకాలతో దోస్తీ కట్టించేందుకు తగిన మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉంది. పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి యువ తరానికి అవగాహన కల్పించడానికి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా కథనం.
ప్రయోజనాలివే..
● ఒంటరితనం పారద్రోలి మంచి స్నేహితులుగా వ్యవహరిస్తాయి.
● ఏకాగ్రత పెరుగుతుంది. విషయాన్ని శ్రద్ధగా చదవడం అలవాటవుతుంది.
● పద సంపద వృద్ధిచెంది భాషపై పట్టు పెరుగుతుంది.
● భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది.
● ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి. లోకజ్ఞానం రెట్టింపవుతుంది.
● సృజనాత్మకత పెంపొందించడానికి విషయ పరిజ్ఞానం తోడ్పడుతుంది.
● విజేతల ఆత్మకథలు చదివినప్పుడు స్ఫూర్తి, ప్రేరణ పొందవచ్చు.
● పరాజితుల అనుభవాలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి.
● ఒత్తిడిని తగ్గించడానికి దివ్యఔషధంగా పనిచేస్తుంది.
దారిచూపే దీపం.. సాంకేతికంగా పురోగమనంలోనూ వన్నెతగ్గని పుస్తకం నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
లక్ష్యానికి చేరువ చేస్తుంది
పిల్లలకు చిన్నప్నటినుంచే పుస్తకపఠనం అలవాటు చేయాలి. విజ్ఞానంతో పాటు మానసిక స్థిరత్వం కూడా కలుగుతుంది. టీవీ, ఫోన్లకు దూరంగా ఉంచాలి. పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా పెద్దయ్యాక ఈ అభిరుచి తాము ఎంచుకున్న లక్ష్యాలకు చేరువ చేస్తుంది. – పోలీస్ భీమేశ్, కవి,
రచయిత, అనంతపేట్, నిర్మల్
ఇంట్లోనే గ్రంథాలయం
పుస్తకాలు చదవడం చిన్నప్పటినుండే అభిరుచిగా మారింది. ఎక్కడ కొత్త పుస్తకం కనపడినా వెంటనే కొనేయడం అలవాటైంది. మిత్రులు, సాహితీవేత్తలు కానుకగా ఇచ్చిన పుస్తకాలతో ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటైంది. ఏ కాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తుంటా. పుస్తకాలు చదవడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
– అంబటి నారాయణ, సాహితీవేత్త, నిర్మల్

సరికొత్త మైత్రిబంధం పుస్తకంతోనే..

సరికొత్త మైత్రిబంధం పుస్తకంతోనే..