
ఏటీఎం కార్డు మార్చి.. రూ.40వేలు నొక్కేసి..!
భైంసాటౌన్(ముధోల్): ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసేందుకు వచ్చిన ఓ యువకుడిని ఏమార్చి అతని కార్డును తన వద్ద ఉన్న కార్డుతో మార్చి నగదు తస్కరించిన ఘటన భైంసా పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని దేగాంకు చెందిన ఆదర్శ్ బ్యాంకు ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసేందుకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఏటీఎంకు వచ్చాడు. డబ్బులు విత్‌డ్రా చేస్తున్న క్రమంలో చింతల్‌బోరికి చెందిన జాదవ్ బాలాజీ డబ్బులు డ్రా చేసిస్తానని చెప్పి అతని కార్డు తీసుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బులు రావడం లేదని, బ్యాంకులో అడగాలంటూ తన వద్ద కార్డు మార్చి ఇచ్చాడు. గమనించని ఆదర్శ్ పని నిమిత్తం గ్రామానికి వెళ్లగా రూ.పదివేల చొప్పున రూ.40వేలు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వెంటనే భైంసాకు చేరుకుని ఏటీఎం పరిసరాల్లో గాలించగా సదరు వ్యక్తి కనిపించాడు. నిలదీయగా పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి అప్పగించారు. పోలీసులు అతని వద్ద తనిఖీ చేయగా ఆదర్శ్ ఏటీఎం కార్డు, జేబులో నగదు లభించింది.