రెండు వారాలకు మించి దగ్గు ఉందా..అయితే టీబీ అయ్యిండొచ్చు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యులు మందులిస్తారు. చిన్నపాటి దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే అదే రేపు ప్రాణాంతకం అవ్వొచ్చు. ముందుగా జాగ్రత్త పడితే ఆరోగ్యం మీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్షయ వ్యాధికి కళ్లెం వేయాలి. అందరం కలిసి క్షయను నిర్మూలించగలం అనే నినాదంతో ఈ ఏడాది ముందుకెళ్తున్నారు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
మంచిర్యాలటౌన్: టీబీ నిర్మూలనకు ప్రభుత్వం నడుంబిగించింది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నా క్షయ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాపకింద నీరులా క్షయ విస్తరించడం, కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా, ఏటా బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా గత ఐదేళ్లుగా కృషి చేస్తున్నా, ఏటా వీరి సంఖ్య వెయ్యికి పైగానే నమోదవుతోంది.
వ్యాధిని గుర్తిస్తారు ఇలా..
టీబీ.. మైకో బ్యాక్టీరియా ట్యూబర్‌కిలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85 శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీనొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రత బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గినా, తుమ్మినా తుంపర్లు వాతావరణంలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు దీని బారినపడతారు. హెచ్‌ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, పిల్లల తల్లులు, సరైన పోషకాహారం తీసుకోనివారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారినపడే ప్రమాదం ఉంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతీరోజు ట్యాబ్లెట్లను వేసుకునేలా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్ధారణకు అధునాతన సీబీనాట్(క్యాట్రేజ్ బేస్‌డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఉండగా, బెల్లంపల్లి సీహెచ్‌సీలో టునాట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గదిని కేటాయించి, సీబీనాట్‌తో పరీక్ష చేసి, చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్‌ను ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించి, వ్యాధిని నిర్ధారిస్తున్నారు.
చికిత్సతో పాటు నగదు
క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స పూర్తయ్యే వరకు నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.వెయ్యి ఇస్తారు. ఈ డబ్బును వారి ఖాతాల్లో జమచేసి, ఆధార్, బ్యాంక్ ఖాతాలతో నిక్షయ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు నర్సింగ్‌హోంలు, ల్యాబ్‌లో పరీక్షలు చేసుకుని, వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తుల వివరాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ యూనిట్ సిబ్బందికి తెలియజేయాలి. ఈ డబ్బులతో వ్యాధిగ్రస్తుడు బియ్యం, పప్పుదినుసులు, గుడ్లు, పాలు, కూరగాయలు కొనేందుకు గాను ఈ మొత్తాన్ని ఉపయోగించాలి. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా దాతలు పౌష్టికాహార పదార్థాలు అందజేస్తారు.
లక్షణాలుంటే పరీక్ష చేసుకోవాలి
చిన్నారులకు బి.సి.జి టీకా వేయడం వల్ల వారు క్షయబారిన పడే అవకాశాలు తక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేసి, వ్యాధి సోకిన వారికి మందులు అందిస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండి, సాయంత్రం జ్వరం వచ్చే వారు ఈ వ్యాధి నిర్దారణ పరీక్షలు చేసుకోవాలి. క్షయ నివారణ జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం ఉండాలి.
– హరీశ్‌రాజ్, డీఎంహెచ్‌వో, మంచిర్యాల
ఏటా పెరుగుతున్న రోగుల సంఖ్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నిష్ప్రయోజనం నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
ఐదేళ్లలో గుర్తించిన టీబీ కేసులు
సంవత్సరం మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ 2020 1,138 1218 1529
2021 1,284 1361 1208
2022 1,445 1565 1549
2023 1,413 1467 1378
2024 1,278 1602 1097
కోరలుచాస్తున్న ‘క్షయ’