కర్బూజ సాగు..లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

కర్బూజ సాగు..లాభాలు బాగు

Mar 19 2025 12:50 AM | Updated on Mar 19 2025 12:47 AM

● జిల్లా వ్యాప్తంగా 70 ఎకరాల్లో సాగు ● అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు ● వేసవిలో పంటకు డిమాండ్‌

చెన్నూర్‌రూరల్‌: పంట మార్పిడి విధానం అవలంభిస్తే అధిక లాభాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఒకేరకం పంటలు సాగుచేస్తే భూసారం దెబ్బతింటుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంట మార్పిడికి ముందుకు వస్తున్నారు. ఇందుకు ఉదాహరణ కర్బూజ సాగు. ఇతర పంటలు సాగు చేసి విసిగి పోయిన కొందరు రైతులు ఇందుకు భిన్నంగా ఆలోచించి వేసవిలో కర్బూజ సాగు వైపు దృష్టి సారించారు. వేసవిలో మార్కెట్‌లో కర్బూజకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో ఈ పంట వైపు దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 70 ఎకరాల్లో కర్బూజ పంట సాగవుతోంది. జిల్లాలోని చెన్నూర్‌, భీమారం, బెల్లంపల్లి, దండేపల్లి, కోటపల్లి, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల్లో పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు పెట్టుబడులు అవుతాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలు సాగుకు అనుకూలం. గింజలు నాటిన సమయం నుంచి మూడు నెలల వరకు పంట కాపుకు వస్తుంది. ఎకరాకు సుమారు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కిలోకు రూ.12 నుండి 15వరకు ధర పలుకుతుంది. ఎకరానికి సుమారు రూ.60 వే ల నుంచి 70వేల వరకు లాభం వస్తుంది. స్వయంగా అమ్మితే లాభం మరింత ఎక్కువగా ఉంటుంది.

చీడపీడల నివారణకు చర్యలు

ఈ పంటను కాయ తొలుచు పురుగు (పండు ఈగ) ఎక్కువగా ఆశిస్తుంది. దీని యొక్క లార్వాలు కాయలోకి చొచ్చుకు పోయి కుళ్లి పోయేలా చేస్తాయి. పురుగు ఆశించక ముందే 10 లీటర్ల నీటిలో 100 ఎంఎల్‌ మలాథియన్‌, 100 గ్రాముల బెల్లం కలిపి వెడల్పాటి పల్లెంలో ఈ ద్రావణం పోసి పంట చేనులో అక్కడక్కడ ఉంచాలి. పురుగు ఆశించిన తర్వాత నివారణకు వెంటనే లీటరు నీటికి 2ఎంఎంల్‌ మలాథియన్‌ లేదా 2 ఎంఎల్‌ క్లోరిఫైరిపాస్‌ పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ నివారణకు జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను చేనులో ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 3ఎంఎల్‌ ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 2 గ్రాముల ఎస్టమిప్రైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఆశిస్తే లీటరు నీటికి 2 గ్రాముల పిప్రోనిల్‌ కలిపి పిచికారీ చేయాలి.

మంచి లాభాలు ఉన్నాయి

వరి, పత్తి పంటల సాగుకు భిన్నంగా వేరే రకం పంటలు సాగు చేయాలని అనుకున్నా. మూడేళ్లుగా రెండెకరాల భూమిలో కర్బూజ సా గు చేస్తున్నా. మంచి లాభాలు ఉన్నాయి. వేసవిలో పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

– కంకణాల లక్ష్మణ్‌రెడ్డి,

కర్బూజ రైతు, ఒతుకులపల్లి

సలహాలు, సూచనలు ఇస్తున్నాం

కర్బూజ సాగులో మంచి లాభాలు ఉన్నాయి. రైతులు ముందుకు వచ్చి ఇలాంటి పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించాలి. నియోజకవర్గ వ్యాప్తంగా కర్బూజ సాగు చేస్తున్న రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం.

– బానోతు ప్రసాద్‌, ఏడీఏ, చెన్నూర్‌

కర్బూజ సాగు..లాభాలు బాగు1
1/2

కర్బూజ సాగు..లాభాలు బాగు

కర్బూజ సాగు..లాభాలు బాగు2
2/2

కర్బూజ సాగు..లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement