జైపూర్: ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని శివ్వారంలో చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల మేరకు శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు పోశక్క, దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్ (26) డిగ్రీ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి మానేశాడు. కొద్దిరోజులుగా ఇంటివద్దే ఉంటున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఏదైనా పని చేసుకోవాలని, లేదా వ్యవసాయం చూసుకోవాలని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం పంట పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.