
భీమారంలో పూర్తయిన ఊర చెరువు సర్వే
భీమారం: మండల కేంద్రంలోని ఊర చెరువులో వారం రోజులుగా సాగుతున్న సర్వే శుక్రవారం పూర్తయింది. 570 సర్వే నంబరులోని చెరువుకు సంబంధించి 14.39 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టడం తెలిసిందే. మంచిర్యాల–చెన్నూరు జాతీయరహదారి పక్కనే చెరువు ఉండడంతో ఆక్రమణకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు చుట్టూ సర్వేయర్లు గుర్తించిన ప్రదేశాల్లో కర్రలు నాటారు. ఇరిగేషన్ డీఈ శారద విలేకరులతో మాట్లాడుతూ గతంలో సర్వే చేసి హద్దులు నిర్ణయించిన దాంట్లోనే తిరిగి సర్వే చేపట్టినట్లు తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ను గుర్తించామని, త్వరలో శ్వాశతంగా ఉండే విధంగా హద్దురాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎస్సై బి.రాములు నేతృత్వంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.