జడ్చర్ల/ పాలమూరు: ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పైసలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దేవాదాయశఖ మంత్రి కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రధాని మోదీ సభకు సంబంధించి మహబూబ్‌నగర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశంతో పాటు జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉంటూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. కేంద్రం సహకారం వలననే సన్నబియ్యం, సోలార్ పంపుసెట్లు వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్ గెలుపు తరువాత కాంగ్రెస్‌లో కలవరం, భయం మొదలైందన్నారు. అభివృద్ధి చైతన్యం, అవినీతి నిర్మూలన తదితర కారణంగానే బీజేపీ పట్ల ప్రజలు ఆదరణ కనబరుస్తున్నారని అన్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఈనెల 10న తెలంగాణకు వస్తున్న మోదీకి ఘనంగా స్వాగతం పలకాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి బాధ్యుల వరకు సమీక్ష నిర్వహించి ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేయాలనే అంశంపై వివరించారు. తెలంగాణలో గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మోసపూరిత పాలన చేస్తోందన్నారు.కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, అంజయ్య, జయశ్రీ, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కొమురయ్య డిమాండ్


