ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
జాబితా షెడ్యూల్ ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. యాక్టివ్‌గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించమని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుది జాబితా ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుంది.
– పద్మ, ఏడీ, చేనేత, జౌళిశాఖ
అమరచింతలో చేనేత మగ్గంపై చీర నేస్తున్న
కార్మికులు (ఫైల్)
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే నెల 15 వరకు ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో అప్పులు లేని సభ్యులకే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. దీంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
2013లో చివరిసారి..
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు చివరిసారి 2013, ఫిబ్రవరిలో జరిగాయి. వీటి పదవీ కాలం 2018లో ముగిసింది. తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు మొత్తం 16 పర్యాయాలు పాత పాలక వర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా గత నెల మార్చి 9 నుంచి మే నెల 10వ తేదీ వరకు పదవీ కాలం పొడిగించింది. జిల్లాలోని పలు సంఘాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
మార్చి 24న ఉత్తర్వులు జారీ..
ఓటరు జాబితా తయారీకి గత నెల 24న చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన బెట్టారు. చనిపోయిన, డిఫాల్టర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. సంఘానికి నగదు లేక వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే డిఫాల్టర్‌గా పరిగణిస్తారు. సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు.
ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు చేనేత జౌళిశాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా రూపొందిస్తారు.
18వ తేదీ నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై ఓటరు జాబితా ప్రదర్శిస్తారు.
27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సవరిస్తారు.
30వ తేదీ నుంచి మే నెల 1 వరకు సంఘాల వారీగా జాబితాలను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేస్తారు.
మే నెల 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు.
మే నెల 6 నుంచి 8వ తేదీ వరకు సంఘాల నోటీసు బోర్డులపై సవరించిన ఓటరు జాబితా ప్రదర్శన. జిల్లా రిజిస్ట్రార్ వద్ద అభ్యంతరాల స్వీకరణ.
మే నెల 11, 12 తేదీల్లో సవరించిన సంతకం చేసిన ఓటరు జాబితా జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు.
మే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర కో–ఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందించాల్సి ఉంటుంది.
వచ్చేనెల 15 వరకు రూపకల్పన
డిఫాల్టర్ల ఓటుహక్కు
తొలగింపునకు అవకాశం
చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళిశాఖకు ఆదేశం
ఉమ్మడి జిల్లాలో 54 సహకార సంఘాలు
ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేస్తుండగా మరికొన్ని సంఘాలు అప్పుడప్పుడు పని చేస్తుండగా.. ఇంకొన్ని సంఘాలు మూతబడ్డాయని జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మ డి జిల్లాలో సుమారు 35 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు.


