యువతకు స్ఫూర్తి బాబు జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

యువతకు స్ఫూర్తి బాబు జగ్జీవన్‌రామ్‌

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌)/ మహబూబ్‌నగర్‌ రూరల్‌: దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ యువతకు స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ జానకి, నగర మేయర్‌ మమతతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ లాంటి ఎందరో మహనీయులు పోరాటం కృషి ఫలాలు మనం అనుభవిస్తున్నాం అన్నారు. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు అని, కేంద్ర కార్మిక, రవాణ, ఆహార, వ్యవసాయ, రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్‌ శాఖలతోపాటు దేశ ఉప ప్రధానిగా కీలక పదవులు నిర్వహించారని కొనియాడారు. 1974లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ప్రారంభించి ఆహార ధాన్యాల కొరతకు పరిష్కారం చూపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు రూపొందించి, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. దళితులకు భూ పంపిణీ, ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాలలో సౌకర్యాలు అభివృద్ధి చేసి వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హరిప్రియ, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనిత, డీఆర్‌డీఓ నర్సింహులు, కార్పొరేటర్లు రమేష్‌బాబు, పూజిత, మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి సునీత, నాయకులు వినోద్‌కుమార్‌, సీజే బెనహర్‌, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement