వివాహిత బలవన్మరణం
కల్వకుర్తి రూరల్: భార్యాభర్తల గొడవలో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్వకుర్తి విద్యానగర్‌లోని భగత్‌సింగ్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. వంగూరు మండలం జాజాలకు కానిస్టేబుల్ గౌతం కల్వకుర్తిలో నివాసం ఉంటూ తెల్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య మాధవి (31), అభినవ దీక్షిత్, నిహారిక, ఆదిత్య సంతానం. సోమవారం అర్ధరాత్రి భార్యాభర్తలు గొడవపడి ఆవేశానికి గురైన భార్య పడకగదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొని ఉరి వేసుకుంది. కాసేపటికి భర్త పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహకారంతో తలుపు బద్దలుగొట్టి చూడగా అప్పటికే మృతిచెందింది. మంగళవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
పురుగుమందు తాగి
వ్యక్తి మృతి
అచ్చంపేట రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మార్లపాడుతండాకు చెందిన సబావత్ లక్ష్మణ్(40) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న లక్ష్మణ్ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా దేవరకొండ ఆస్పత్రికి అక్కడి నుంచి నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీసులు తెలిపారు.
బెల్టు షాపుపై కేసు నమోదు
అమరచింత: మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్‌పై మంగళవారం పోలీసులు దాడి చేసి 4.5 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారని ఎస్‌ఐ స్వాతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గ్రామంలో అక్రమ బెల్ట్ షాపును కొనసాగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మికంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


