పారదర్శకంగా నిర్వహించేందుకు పార్టీలు సహకరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడల్ కోడ్ పాటించాలని కోరారు. జిల్లాలోని మొత్తం 3,674 పోలింగ్ కేంద్రాలలో 999 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ పోలింగ్‌కేంద్రాలలో ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తిస్థాయి భద్రత కోసం, వెబ్‌కాస్టింగ్, సీసీ టీవీ కెమెరాలు, సూక్ష్మ పర్యవేక్షకులతో పాటు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో, రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను, నివృత్తి చేస్తూ, వారి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు పరిశీలన సమయంలోనే నమోదు చేయాలని, ఆలస్యంగా ఇచ్చే అభ్యంతరాలు స్వీకరించమని చెప్పారు. రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ)వద్ద తిరస్కరిస్తే అప్పీల్‌కు వెళ్లవచ్చని, అయితే ఆర్‌డీఓ వద్ద అప్పీల్ తిరస్కరిస్తే.. అదే తుది తీర్పు అవుతుందని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు వారి తుది జాబితాలోని పేర్ల అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో వివాదాలు లేకుండా ఉండేందుకు మంచి ప్రవర్తన కలిగిన ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా పూర్త య్యేలా తమ అభ్యర్థులకు కూడా మార్గనిర్దేశంచే యాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశం


