ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): 2వ విడత జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పక్కాగా ఉండాలని, తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఎంసీసీ, ఎన్నికల వ్యయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించామని, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కూడా సమకూరుస్తున్నట్లు తెలియజేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు, మెక్రో అబ్జర్వర్లను నియమించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ.. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నట్లు, బైండోవర్ కేసులు 61 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ నిఖిల, ఆర్‌డీఓ నవీన్, టైటస్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల వివరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సాధారణ పరిశీల కురాలు కాత్యాయనీదేవి సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మీడియా సెంటర్ పనితీరును అడిగి తెలు సుకున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారా న్ని సేకరించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించాలన్నారు. ప్రతిరోజూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) వార్తలను గుర్తించి అధికారులకు తెలియజేయాలన్నారు.


