‘సంకల్పం గట్టిదైతే విజయం తథ్యం’
జడ్చర్ల టౌన్: సంకల్పం గట్టిదైతే అన్ని సమకూరుతాయని దివంగత అందెశ్రీ నిరూపించారని ప్రముఖ సాహితివేత్త, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో ప్రజాసంఘాలు, టీఎస్‌యూటీఎఫ్, ఉదయమిత్ర సంయుక్త ఆధ్వర్యంలో అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధారెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ జీవితం, ఆయన పాడిన పాటలు అనేక అనుభవాలను నేర్పుతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలా చేశాయన్నారు. అన్ని సవ్యంగా ఉంటే సాధించటానికి ఏముండదని, విద్యార్థులు సైతం సంకల్పం పెట్టుకుని దానిని సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాహిత్యం చదవాలని, తద్వారా మనుషుల మనస్థత్వాలు తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరిచెట్లు పాడయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్‌కళ్యాణ్‌కు దిష్టిలోపం ఏర్పడిందని, తెలంగాణ ప్రజలు ఒకరిని అక్కున చేర్చుకుని ఆదరించే వారే తప్ప, ఇతరులకు దిష్టి తగలాలని కోరుకోరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అందెశ్రీ ఉన్నతమైన వ్యక్తి
అందెశ్రీ గొప్ప విలువలు ఉన్న వ్యక్తి అని, ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలని ప్రజాకవి ఉదయమిత్ర, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నర్సింములు అన్నారు. అంతకముందు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కృష్ణ, మల్లస్వామి, సైకాలజిస్ట్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


