‘పాప’ం.. ప్రాణం తీసింది
● ముళ్ల పొదల్లో విసిరేసిన తల్లి
● చికిత్స పొందుతూ చిన్నారి మృతి
నారాయణపేట రూరల్: మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. పొత్తిళ్ల నుంచి కళ్లు తెరవని మూడు రోజుల పసికందును ముళ్ల పొదల్లో విసిరేసి కర్కశంగా మారింది. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ధన్వాడకు చెందిన బాల నరసింహులు అప్పక్‌పల్లి గ్రామానికి చెందిన భారతి భార్యాభర్తలు. భారతి ప్రసవానికి నవంబర్ 24న జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 26న డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో కలిసి ఇంటికి వెళ్లిన భారతి ఆదివారం తెల్లవారుజామున తన తల్లి తాయిలమ్మతో కలిసి గ్రామ శివారులో కాటన్ మిల్లు వద్ద చిన్నారిని ముళ్ల పొదల్లో విసిరేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు చిన్నారి ఏడుపు వినిపించి దగ్గరకు వెళ్లి చూసి 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న టెక్నీషియన్ శిరీష, పైలెట్ రాములు పాపకు ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహేందర్ ఉదయం పరిశీలించి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. అయితే సాయంత్రం పరిస్థితి విషమించి పాప మృతి చెందింది. విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పాప తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


