తెలంగాణకు బీఆర్‌ఎస్సే అసలైన విలన్
జడ్చర్ల: తెలంగాణకు అసలైన విలన్ బీఆర్‌ఎస్ పార్టీ అని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలనా.. అంటూ ప్రశ్నించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారో ప్రజలు చూశారని, చివరికి బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తి వేయడం, కేబినెట్‌లో ఐదేళ్లపాటు మహిళలకు స్థానం లేకపోవడం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు బీఆర్‌ఎస్‌కు దక్కకపోగా ఏడు స్థానాల్లో డిపాజిట్లూ కోల్పోయారని విమర్శించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఫలితాలే మున్ముందు వస్తాయని, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అనూహ్యంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, నాయకులు మినాజ్, ఖాజ, సర్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ మల్లురవి ధ్వజం


