ప్రజావాణి రద్దు : కలెక్టర్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఫిర్యాదులు అందించేందుకు రావొద్దని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర అన్నారు. నోడల్ అధికారులు, ఏఈఓలు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, స్టేజ్–1 ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, స్టేజ్–2 ఆర్‌ఓలు, పీఓలు, ఓపీఓ, లైజన్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలరించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: గీతా జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మహిళ సాహిత్య, సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తిపీఠం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని శిశు వికాస్ గ్రామర్ స్కూల్‌లో విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్లో దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి భగవద్గీత విశిష్టత గురించి వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుందన్నారు. మరో ముఖ్య అతిథి రావూరి సూర్యనారాయణ మాట్లాడుతూ భగవద్గీతను పఠించడం ద్వారా విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మల్లేష్ మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందిన మానసిక వికాసం పెరుగుతుందన్నారు. అనంతరం జూనియర్, సీనియర్ విభాగాల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, మెమోంటోలు, పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి భగవద్గీత పుస్తకం, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా గడ్డం వనజ, పులి జమున, శ్రీలత, డాక్టర్ కె.బాలస్వామి, ప్రాణేష్ వ్యవహరించారు. పాఠశాల యాజమాన్యం సుబ్బయ్య, శ్రీదేవి, శ్రీవాణి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రం
పరిశీలన
దేవరకద్ర: మండలంలోని గూరకొండ క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవి పరిశీలించారు. రెండో విడతలో భాగంగా ఆదివారం నామినేషన్ల స్వీకారం ప్రారంభం కాగా.. పోలీసు బందోబస్తును పరిశీలించి ఎస్‌ఐతో మాట్లాడారు. నామినేషన్ కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కేంద్రంలోకి అభ్యర్థితోపాటు బలపరిచిన వారు మాత్రమే రానివ్వాలని, కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక, ఎస్‌ఐ నాగన్న తదితరులున్నారు.
ప్రజావాణి రద్దు : కలెక్టర్


