పకడ్బందీగా నామినేషన్ దాఖలు ప్రక్రియ
మహమ్మదాబాద్/ గండేడ్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన సర్పంచ్, వార్డుసభ్యుల పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆదివారం ఆమె గండేడ్ క్లస్టర్‌లోని గండేడ్, జంగంరెడ్డిపల్లి, అంచన్‌పల్లి గ్రామ పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాలను సందర్శించి.. సర్పంచ్, వార్డు సభ్యుల స్క్రూట్నీని పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో మాట్లాడి ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. మహమ్మదాబాద్ రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కంచన్‌పల్లి, మహమ్మదాబాద్ జీపీలకు సంబంధించిన నామినేషన్ల స్క్రూట్నీని పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గండేడ్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాల పత్రాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పడంతో ఆమె వారిపై అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పారు. ప్యాడీ క్లీనర్‌లను ఉపయోగించి ధాన్యం క్లీన్‌గా చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓలు నరేందర్‌రెడ్డి, మంజుల, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి తదితరులున్నారు.


