ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
● నవ వధువు అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం ● వధువు తల్లి పరిస్థితి విషమం
ఎర్రవల్లి: అత్తారింటికి పోతున్న ఓ నవ వధువు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఆరుగురు గాయపడగా వధువు తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఉండవెల్లి మండలం ప్రాగటూరుకు చెందిన మహేశ్వరికి పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన చాకలి నరేష్‌తో ఈ నెల 26న వివాహం జరిగింది. వివాహం అనంతరం నవ దంపతులు ఇద్దరు అత్తారింట్లో పందిరి దించేందుకు వధువు తల్లి పద్మ, కుటుంబ సభ్యులు అనంతమ్మ, సౌభాగ్య, నర్సింహ, చిన్నారి నిహారికతో కలిసి శనివారం షేరుపల్లికి చెందిన ఆటోలో డ్రైవర్‌తో పాటు మొత్తం ఏడుగురు వెళ్తుండగా జాతీయ రహదారిపై కొట్టం కాలేజీ సమీపంలో టైరు పేలి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధువు మహేశ్వరి, తల్లి పద్మ, చిన్నారి నిహారికలకు తీవ్రగాయాలు కాగా వరుడు నరేష్‌తో పాటు మరో ముగ్గురు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానిక ఎస్‌ఐ రవినాయక్‌ను వివరాణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.
మైనర్ బాలికలకు మాయమాటలు
మహబూబ్‌నగర్ క్రైం: మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన 9మంది యువకులను షీటీం పోలీసులు గుర్తించి ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారందరికి శనివారం ఉమెన్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు షీటీం బృందం గత వారం రోజులుగా నగరంలోని పార్క్‌లు, కళాశాలలు, పాఠశాలల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో 9మంది పట్టుబడగా వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్ బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్ ప్రమాదంలో వేసుకున్నట్లే అవుతుందని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళ భద్రతను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు


