ప్రారంభమైన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వనపర్తిటౌన్: మేధోపరమైన సాంస్కృతిక క్రీడ చెస్ అని డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎంఈఓ మద్దిలేటి, పరీక్షల నిర్వాహణ అధికారి గణేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల రాష్ట్రస్థాయి చెస్ పోటీలను వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలిరోజు మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ క్రీడాకారులకు రెండు విడతల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రాచుర్యం ఉన్న ఎన్నో ఆటలు శరీర దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడితే.. చెస్ మేధస్సును పెంచేందుకు సహకరిస్తుందన్నారు. చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధానకార్యదర్శి బస్వప్రభు, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి టీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. చదరంగంతో మెదడుకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు ఐక్యూ, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం చెస్ క్రీడాకారుల్లో పెరగడంతో పాటు సృజనాత్మకంగా ఆలోచించడం, గెలుపోటములను సమానంగా స్వీకరించే ధోరణి అలవడుతుందన్నారు. వనపర్తిని చెస్‌కు కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతున్నామని, రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు వచ్చే నెల అస్సాంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. చెస్ పోటీలు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్‌బీ టేటర్ చంద్రమౌళి పర్యవేక్షణలో జరిగాయి. కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్, అయోధ్య రాములు, ఫణిభూషణ్, సత్యనారాయణ, పానుగంటి మోహన్‌బాబు (యేబు) తదితరులు పాల్గొన్నారు.


