గగన్‌చంద్ర ప్రతిభ గర్వకారణం
బల్మూర్: విద్యార్థి గగన్‌చంద్ర విద్యుత్ బ్యాటరీ, సోలార్, పెడలింగ్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించి వివిధ ప్రదర్శనల్లో ఉంచి జాతీయస్థాయిలో యంగ్ సైంటీస్ట్ అవార్డు అందుకొని రాష్ట్రం, జిల్లా, పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత సంతోష్ అభినందించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. అలాగే బల్మూరులో శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గగన్‌చంద్ర కీర్తిని చాటుతూ అభినందన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత విద్యార్థి బాల్యంలోనే తన విజ్ఞానంతో త్రి ఇన్ వన్ సైకిల్‌ను రూపొందించారని, త్వరలోనే పేటెంట్ హక్కు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం గగన్‌చంద్రతో పాటు గైడ్ టీచర్ సీతారాం, తండ్రి భాస్కర్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ ఉమాపతి, అధికారులు పాండు, కృష్ణయ్య, ఎస్‌ఐ రాజేందర్, ఉపాధ్యాయు లు, గ్రామపెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.


