రంగంలోకి నిఘా బృందాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల ప్రచార సరళి, నేతల అనుసరిస్తున్న తీరు గ్రామాల పర్యటన వంటి అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు పట్టించుకోకుండా తీసుకెళుతున్న నగదు, బంగారంతో పాటు మద్యం పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా, గ్రామాల సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మొదట విడత నామినేషన్ల ప్రకియ శనివారంతో ముగుస్తుండడంతో ప్రధాన అభ్యర్థుల ప్రచారాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 32 రంగంలోకి నిఘా బృందాలు (ఎఫ్‌ఎస్‌టీ) ఏర్పాటు చేస్తూ తేదీన జిల్లా ఎన్నికల అఽధికారి విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బృందాలు పని చేస్తాయి. ఒక్కొ మండలానికి రెండు టీంలను ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో ఇద్దరు ఉద్యోగులుంటారు. వీరు మోడల్ కోడ్ ఉల్లంఘన చర్యల ఫిర్యాదులను పరిశీలిస్తారు. మద్యం, నగదు ఇతర వస్తువులతో ఓటర్లను ప్రభావితం ఏమైనా చేస్తున్నారో ఆరా తీస్తారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున ఖర్చుల వివరాలు నమోదు చేస్తారు. ర్యాలీలు, బహిరంగసభల్లో వ్యయాలపై వీడియో తీసి నిఘా ఉంచుతారు. ఫిర్యాదు వచ్చిన అరగంటలోపు ఈ బృందాలు చేరుకుంటాయి. 24 గంటలూ పని చేసేలా విడతల వారీగా బృందాలను నియమించారు.
● జిల్లాలో రెండు ఎస్‌ఎస్‌టీ (స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీం)లను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు నవాబ్‌పేట మండలం కొల్లూర్, బాలానగర్ టోల్‌ప్లాజా వద్ద రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంలో రెండు విభాగాలుగా, ఒక్కొక్క విభాగంలో ముగ్గురు ఉద్యోగుల చొప్పున 12 మంది సిబ్బంది ఉంటారు. రూ.50 వేలకు పైగా నగదు రూ.10 వేలకు పైగా ఎన్నికల సామగ్రి వాహనాల్లో లభ్యం అయితే సీజ్ చేస్తారు. పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లయితే ఆదాయ పన్ను శాఖ ద్వారా జప్తు చేస్తారు.
నోడల్ ఆఫీసర్ల నియామకం
గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వహణకు అధికార యంత్రాంగానికి కలెక్టర్ విజయేందిర ఒక్కొక్క పని అప్పగించారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలతో కలిపి అఖిల పక్ష సమావేశాలు చేశారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కొ అధికారికి ఒక్కొ పని పర్యవేక్షించే విధంగా బాధ్యతలు అప్పగించారు.
జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
మొత్తం 32 ఎఫ్‌ఎస్‌టీ, రెండు ఎస్‌ఎస్ బృందాల ఏర్పాటు
12 మంది నోడల్ అధికారులనియామకం


