వేలంతో ‘ఏకగ్రీవ’ తీర్మానాలు
నవాబుపేట/‘సాక్షి’నెట్‌వర్క్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన హెచ్చరికలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో బేఖాతరు చేస్తున్నారు. గ్రామాభివృద్ధి అంటూ సర్పంచ్, వార్డు స్థానాలను వేలం వేస్తూ స్థానిక పెద్దలే ముందుండి నడిపిస్తున్నారు.
● నవాబుపేట మండలంలోని మండలంలోని దొడ్డిపల్లి జీపీకి సంబంధించి సర్పంచ్, ఉపసర్పంచ్‌లు ఏకగ్రీవంగా చేసుకునేందుకు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని... ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారితోనే శనివారం నామినేషన్లు వేయించనున్నట్లు సమాచారం. దొడ్డిపల్లిలో 684 మంది ఓటర్లు ఉండగా.. ఎస్‌సీ మహిళలకు రిజర్వ్ చేశారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం అప్పాయపల్లి తండాలో సర్పంచ్‌తో పాటు 8 వార్డులకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందేకు తీర్మానం చేశారు.
● గద్వాల మండలం కుర్వపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళాకు రిజర్వ్ కాగా..గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తన భార్యను సర్పంచ్ చేయడం కోసం గుడి నిర్మాణానికి రూ.45 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. వీరాపురం గ్రామంలో సైతం సర్పంచ్ పదవికి జరిగిన పోటాపోటీ వేలంలో ఓ రైతు ఏకంగా రూ.50 లక్షలకు పాటపాడినట్లు సమాచారం. ఇదే మండలం ఈడిగోనిపల్లి రూ.35 లక్షలకు వేలం పాట పాడి ఓ యువకుడు సర్పంచ్ స్థానాన్ని పొందారని తెలిసింది.
● గట్టు మండలంలో మిట్టదొడ్డి సర్పంచు స్థానం రూ.90లక్షలకు వేలంపాట పాడి కొనుగోలు చేశారు. పెంచికలపాడు గ్రామ సర్పంచ్ స్థానాన్ని రూ.31.50 లక్షలు, ఉపసర్పంచ్ పదవికి సైతం వేలం వేయగా రూ. 8.50 లక్షలకు దక్కించుకున్నారు. అరగిద్ద సర్పంచు స్థానం రూ.31 లక్షలు, తుమ్మలపల్లి రూ.30 లక్షలు, తారాపురం రూ.16.50 లక్షలు, కేటీదొడ్డి మండలం రంగాపురం రూ.15 లక్షలు, సుల్తానపురం రూ.8 లక్షలులకు వేలం పాడినట్లు సమాచారం.మల్లాపురం గ్రామంలో కూడా వేలం ద్వారా ఏకగ్రీవం చేసినట్లు తెలుస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో రూ.42 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణానికి ముందుకొచ్చిన సీడ్ ఆర్గనైజర్ సర్పంచ్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే మండలంలో మగ్గంపేట, బిజ్వారం, పెదొడ్డి గ్రామాలలో సైతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిజ మండలం కుర్వపల్లి రూ.7.50 లక్షలకు, కిష్టాపురం రూ.10.35 లక్షలకు వేలం ద్వారా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నారు.


