సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
మహబూబ్‌నగర్ క్రైం: పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ డి.జానకి అన్నారు. నవాబ్‌పేట, కారుకొండ, గురుకుంట నామినేషన్ కేంద్రాలను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉంటాయని తెలిపారు. నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలపై సమీక్షించారు. శాంతి భద్రతల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల రోజు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు పోలీసు బలగాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు.


