ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పంచాయతీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి అధికారి విధి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారి కొత్త సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏ పార్టీకి, అభ్యర్థికి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలను సందర్శించి, పోలింగ్‌స్టేషన్లను తనిఖీ చేయాలని, కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సమగ్రమైన శిక్షణ అందించాలని సూచించారు. పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా తనిఖీ చేసి, సిబ్బందికి సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును నిబంధనల ప్రకారం నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను గ్రామపంచాయతీ ప్రత్యేక సమావేశంలో పకడ్బందీగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ట్రెయినీ డీపీఓ నిఖిల, డీఎల్‌పీఓ రామ్మోహన్, మాస్టర్ ట్రైనర్ బాలుయాదవ్, రతంగపాణిరెడ్డి, పాండురంగ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


