సర్పంచ్ 441.. వార్డులు 174
● తొలి దశ జీపీ ఎన్నికల్లో తొలిరోజు దాఖలైన నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో తొలి దశలో 550 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి దశలో జరిగే ఎన్నికలకు సంబంధించి 550 సర్పంచ్ స్థానాలు ఉండగా.. తొలి రోజు 441 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 4,840 వార్డు స్థానాలు ఉండగా... 174 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
● మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి తొలి విడతలో మొత్తం 40 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 139 సర్పంచ్ స్థానాలకు 108, 1,188 వార్డులకు 73 నామినేషన్లు వచ్చాయి.ఇందులో మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో సర్పంచ్‌కు 35, వార్డులకు 34, నవాబుపేట మండలంలో సర్పంచ్‌కు 21, వార్డులకు 18, మహమ్మదాబాద్‌లో 13 సర్పంచ్, 8 వార్డులకు, గండేడ్‌లో 28 సర్పంచ్, ఒకటి వార్డుకు, రాజాపూర్ మండలంలో 11 సర్పంచ్‌కు, 12 వార్డులకు నామినేషన్లు ఉన్నాయి. కాగా నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. 29వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అయితే శుక్రవారం అష్టమి కావడంతో నామినేషన్లు తక్కువగానే వచ్చే అవకాశం ఉంది. శనివారం రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు రావొచ్చు.


