నల్లచట్టాలు అమలు చేస్తే గద్దె దింపుతాం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దొడ్డిదారిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు చేస్తే గద్దె దింపుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎ.రాములు హెచ్చరించారు. ప్రతీ రైతు నుండి ఎకరాకు 14 క్వింటాళ్ల పత్తి పంటను కొనుగోలు చేయాలని, విదేశీ పత్తి దిగుమతులపై సుంకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టౌన్ హాలు నుంరి క్లాక్ టవర్ వరకు ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను అమలు మరిచి రైతు వ్యతిరేక చట్టాలను అమలును చాపకింద నీరులా అమలు చేస్తుందని మండిపడ్డారు. దేశ రాజధాని సరిహద్దులో దాదాపు 13 నెలల పాటు రైతులు చేపట్టిన విరోచిత పోరాటంలో 750 మంది రైతుల చావుకు ప్రభుత్వం కారణమైందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అమలవుతున్న 29 చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చి 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లేబర్ కోడ్‌లను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశా రు. తక్షణమే ఉపాధి హామీలో తొలగించిన 55 లక్షల జాబ్‌కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకు లు కిల్లెగోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, సి.వెంకటేశ్, దేవదానం, సాంబశివుడు, కృష్ణ, సురేష్, రాములు యాదవ్, రామ్మోహన్ పాల్గొన్నారు.


